Ayodhya: అయోధ్య భూమిని హిందువులకు ఇచ్చేద్దామంటూ మేధావులు చేసిన ప్రతిపాదనకు ముస్లిం లా బోర్డు తిరస్కరణ
- 'సుహృద్భావ చర్య' అంటూ తెరపైకి వచ్చిన ముస్లిం మేధావులు
- అవి కొందరి అభిప్రాయాలేనంటూ ముస్లిం బోర్డు స్పష్టీకరణ
- సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నామని వెల్లడి
అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం 70 ఏళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఇరుపక్షాలు అక్టోబరు 17 లోపు వాదనలు పూర్తిచేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. త్వరలోనే దీనిపై అత్యంత కీలకమైన తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో, కొందరు ముస్లిం మేధావులు వివాదాస్పద బాబ్రీ మసీదు భూమిని 'సుహృద్భావ చర్య'గా హిందువులకు ఇచ్చేద్దామని ఓ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు.
అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మాజీ వీసీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా, యూపీ మాజీ సీఎస్ అనీస్ అన్సారీ తదితరులు వివాదాస్పద భూమిపై ఆరోపణలను, వాదనలను వెనక్కి తీసుకుందామని సూచించారు. అయితే, ముస్లిం పర్సనల్ లా బోర్డు అంశాల వారీగా ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది.
ఇవి కేవలం కొందరి అభిప్రాయాలు మాత్రమేనని, భూమి వివాదంలో ఈ అభిప్రాయాలను తమ వైఖరిగా ఎంతమాత్రం భావించరాదని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు జఫర్యాబ్ జిలానీ స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వ చర్చలు ఇప్పటికే విఫలం అయ్యాయని, తమ వాదనల పట్ల ఎంతో ధీమాగా ఉన్నామని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.