pick poketer: చోరీ డబ్బుతో వడ్డీ వ్యాపారం... కేటుగాడిని పట్టుకున్న పోలీసులు!

  • ఈ పాత నేరస్తుడి రూటే సెపరేటు
  • పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా అదే వ్యాపకం
  • తనతోపాటు ఓ గ్యాంగ్‌ నిర్వహణ

చూడడానికి చిన్నచిన్న దొంగతనాల్లా కనిపించినా అతని రూటే సెపరేటు. ఎప్పటి నుంచో ఇదే వ్యాపకం. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా అదే వ్యవహారం. చోరీ చేసిన డబ్బు వడ్డీలకు తిప్పుతూ, ఇతర అవసరాలకు వాడుతుంటాడు. పలుచోట్ల జేబు దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కె.ఎస్‌.ధరమ్‌(40) తీరిది. హైదరాబాద్, మల్లేపల్లి అఫ్జల్‌ సాగర్‌కు చెందిన ధరమ్‌ పాత నేరస్తుడు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన తీరు మార్చుకోలేదు.

పిక్‌ పాకెటింగ్‌కు పాల్పడుతూ 2014 నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా బహదూర్‌పురా, కంచన్‌బాగ్‌, బేగంబజార్‌, హుమయూన్‌నగర్‌, నాంపల్లి పీఎస్ ల పరిధుల్లో ఆరు గొలుసు చోరీలు, డబ్బు అపహరించిన కేసులు రెండు నమోదయ్యాయి. చివరకు పోలీసులకు చిక్కడంతో అతడి వద్ద నుంచి రూ. 4.15 లక్షల విలువ చేసే 10 తులాల బంగారం, 15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇతన్ని విచారించగా 8ఏ, 8ఎం, 2జే బస్సుల్లో రద్దీ సమయాల్లో వృద్ధులను టార్గెట్‌ చేసి చోరీలు చేస్తున్నట్లు తెలిపాడు. చోరీ చేసిన సొత్తు విక్రయించి వచ్చిన డబ్బును స్థానికులకు వడ్డీకి ఇస్తుంటాడని తేలింది. తను ఓ గ్యాంగ్‌ ను కూడా నిర్వహిస్తున్నాడు. సహచరులు జైలుకు వెళితే వారిని విడిపించడానికి తన డబ్బే ఖర్చు చేస్తుంటాడు. నిందితుడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News