Anand Mahindra: మట్టిలో 'క్యారమ్స్'.. చిన్నారుల క్రియేటివిటీకి ఆనంద్ మహీంద్రా ఫిదా
- క్యారమ్స్ ఆడుతున్న పేద పిల్లలు
- ఎటువంటి ఖర్చులేకుండా మట్టిలో క్యారమ్ బోర్డ్
- దేశంలో సృజనాత్మకతకు ఎటువంటి కొదవలేదన్న మహీంద్రా
యువతలో స్ఫూర్తిని నింపేలా క్రియేటివిటీతో చేసే పనులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్న మహీంద్ర గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తాజాగా మరోసారి ఇటువంటి ట్వీట్ తోనే నెటిజన్లను ఆకర్షించారు. 'మట్టిలో మాణిక్యాలు'లాంటి పేద పిల్లల క్రియేటివిటీకి ఆయన ఫిదా అయిపోయారు. 'నా వాట్సాప్ వండర్ బాక్స్ లో ఈ రోజు ఉదయం ఓ అద్భుతమైన ఫొటో చూశాను. భారత్ లో ఊహాశక్తికి ఎటువంటి కొదవలేదన్న విషయాన్ని నిర్వివాదంగా ఇది రుజువు చేస్తోంది' అని ట్వీట్ చేశారు.
కొంతమంది పిల్లలు క్యారమ్స్ ఆడుతుండడం ఈ ఫొటోలో ఉంది. అయితే, ఆ ఫొటోను గమనించి చూస్తే వారు ఆడుతున్న క్యారమ్ బోర్డ్ చెక్కతో చేసింది కాదు. డబ్బు ఖర్చు చేయకుండా మట్టిని చదునుగా చేసి, అచ్చం క్యారమ్ బోర్డులా చేసుకుని ఆ పేద పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక క్యారమ్స్ డిస్క్ లకు బదులుగా సీసాల మూతలను వినియోగించారు. అందుకే ఆనంద్ మహీంద్రాను కూడా వీరి క్రియేటివిటీ ఆకర్షించింది. 'గొప్ప ఆలోచనలకు పుట్టినిల్లు భారత్' అని చెప్పేలా వారి క్రియేటివిటీని ఆయన ప్రశంసించారు.