Japan: జపాన్ ను హడలెత్తిస్తున్న 'హగిబిస్' టైఫూన్

  • 1958 తర్వాత జపాన్ కు అతిపెద్ద ముప్పు
  • ఇప్పటికే మొదలైన హగిబిస్ బీభత్సం
  • భారీస్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు

పసిఫిక్ మహాసముద్రంలో తరచూ భూకంపాల ప్రభావానికి లోనయ్యే జపాన్ ఇప్పుడు ఓ భీకర విపత్తు ముంగిట నిలిచింది. 1958 తర్వాత అత్యంత తీవ్రస్థాయిలో ఓ టైఫూన్ జపాన్ ను వణికిస్తోంది. ఈ అతి తీవ్ర టైఫూన్ కు హగిబిస్ అని నామకరణం చేశారు. ఫిలిప్పీన్స్ భాషలో హగిబిస్ అంటే వేగం అని అర్థం. ఇది పేరుకు తగ్గట్టే జపాన్ ప్రధాన భూభాగం దిశగా దూసుకువస్తోంది. ఈ రాత్రికి టోక్యోను తాకనుంది. ఇప్పటికే జపాన్ అధీనంలోని దీవులను తుడిచిపెట్టిన హగిబిస్ గురి రాజధాని టోక్యోపైనే ఉందని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. ఇజు ద్వీపకల్పం వద్ద తీరాన్ని దాటిన హగిబిస్ మరికొన్ని గంటల్లో టోక్యోను తాకుతుందని అంచనా వేస్తున్నారు.

కేటగిరీ 5 టైఫూన్ గా కొనసాగుతున్న హగిబిస్ ధాటికి జపాన్ తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతోంది. గంటకు 195 మైళ్లకు మించి వేగంతో పెనుగాలులు వీస్తుండగా, కుండపోత వర్షంతో వరదలు ముంచెత్తుతున్నాయి. టోక్యో, పరిసర ప్రాంతాల్లో 800 మిమీ వర్షపాతం నమోదవ్వొచ్చన్నది స్థానిక వాతావరణ సంస్థల అంచనా. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టైఫూన్ భయంతో జపనీయులు ముందుగానే నిత్యావసరాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో డిపార్ట్ మెంటల్ స్టోర్లు బోసిపోయినట్టు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News