KCR: కేసీఆర్ నిర్ణయంతో ఒంటికి నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్... ఖమ్మంలో ఉద్రిక్తత

  • సమ్మెలో పాల్గొన్నవాళ్లకు జీతాలు ఇవ్వబోమన్న కేసీఆర్
  • మనస్తాపం చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి
  • ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న వైనం

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉద్ధృతం అవుతోంది. ఈ క్రమంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులకు జీతాలు బంద్ అని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి అనే ఆర్టీసీ డ్రైవర్ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. శ్రీనివాసరెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనలో శ్రీనివాసరెడ్డిని కాపాడబోయి అతని కుమారుడు సురేశ్ కూడా గాయపడ్డాడు. జీతాలు ఇవ్వబోమని కేసీఆర్ ప్రకటించడంతోనే శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడని అతని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనతో ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ఇతర ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో శ్రీనివాసరెడ్డి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వచ్చి సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News