Chhattisgarh: హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిమి ఉగ్రవాది అరెస్ట్
- 2013లో పాట్నా, బోధ్‌గయలో పేలుళ్లు
- ఆ తర్వాత దుబాయ్ పారిపోయిన కెమికల్ అలీ
- హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేసిన చత్తీస్‌గఢ్ పోలీసులు
పాట్నా, బోధ్‌గయలలో 2013లో జరిగిన బాంబు పేలుళ్లలో పాల్గొని ఆ తర్వాత సౌదీ అరేబియాకు పారిపోయిన సిమి ఉగ్రవాది కెమికల్ అలీ, అలియాస్ అజారుద్దీన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అలీ అరెస్ట్‌తో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య మొత్తం 17కు చేరుకుంది. రాయ్‌పూర్‌కు చెందిన అలీ, సౌదీలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు.
తాజాగా, కుటుంబ సభ్యులను కలిసేందుకు నగరానికి వచ్చిన అలీని పోలీసులు పక్కా సమాచారంతో ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం చత్తీస్‌గఢ్ తీసుకెళ్లారు. అయితే, అలీ నిజంగానే కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చాడా? లేక, నగరంలో ఎక్కడైనా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులను అప్రమత్తం చేశారు.