Gujarat: గుజరాత్ తీరంలో పాక్ పడవలు.. కొనసాగుతున్న తనిఖీలు
- హరామీ క్రీక్ ప్రాంతంలో ఐదు పాక్ పడవలు
- నిఘా వర్గాల సమాచారంతో గుజరాత్ తీరంలో గట్టి నిఘా
- పడవల్లో అనుమానాస్పద వస్తువులు లేవన్న బీఎస్ఎఫ్
గుజరాత్ తీరానికి అత్యంత సమీపంలో పాక్ పడవలు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి చొరబాట్లు ఉండే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుజరాత్ తీరంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో హరామీ నాలా క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఐదు చేపల పడవలను గుర్తించింది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని తనిఖీలు నిర్వహించింది. పడవల్లో ఇప్పటి వరకు అనుమానాస్పద వస్తువులేవీ కనిపించడం లేదని బీఎస్ఎఫ్ తెలిపింది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది.
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాక్.. భారత్‌లో విధ్వంసానికి ప్లాన్ చేస్తోందన్న నిఘావర్గాల సమాచారంతో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉండడంతో తీరప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.