tsrtc: టీఎస్సార్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదు: మంత్రి గంగుల కమలాకర్
- ప్రతి యూనియన్ నాయకుడి వెంట ఓ రాజకీయ పార్టీ ఉంది
- వాళ్లు కార్మికులను బలిపశువులను చేసే యత్నం
- కార్మికులు పునరాలోచించి తమ సమ్మె విరమించాలి
టీఎస్సార్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని గానీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని గానీ సీఎం కేసీఆర్ ఏనాడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రతి యూనియన్ నాయకుడి వెంట ఒక రాజకీయ పార్టీ ఉందని, వాళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం స్వార్థపూరితంగా ఆలోచించి కార్మికులను బలిపశువులను చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
కార్మికులు పునరాలోచించి తమ సమ్మెను విరమించాలని కోరారు. సమ్మె కారణంగా ప్రజలు, విద్యార్థులు, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నాయకులు, తమ పార్టీ అధికారంలో ఉన్న పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు. కార్మిక నేతలు కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తోందని, ఇప్పటికే బీఎస్ఎన్ ఎల్ సంస్థ గొంతు నలిపిందంటూ బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు.