Telugudesam: మాజీ ఎంపీ జేసీ సూట్‌కేసు నుంచి రూ. 6 లక్షలు మాయం.. కారు డ్రైవరే నిందితుడు
- ఈ నెల 11న విమానంలో విజయవాడ చేరుకున్న జేసీ
- ఆయన సూట్‌కేసు నుంచి ఆరు లక్షలు కాజేసిన డ్రైవర్
- డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసులు
టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూట్ కేసు నుంచి మాయమైన రూ.6 లక్షలు దొరికాయి. ఆయన కారు డ్రైవరే ఆ డబ్బులు నొక్కేసి సీటు కింద పెట్టాడు. నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. జేసీ ఈ నెల 11న మధ్యాహ్నం విమానంలో విజయవాడ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి కారులో నేరుగా గాంధీనగర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. జేసీ సూట్‌కేసును ఆయన కారు డ్రైవర్ గౌతం తీసుకొచ్చి హోటల్ రూములో పెట్టి వెళ్లిపోయాడు.
సాయంత్రం ఆ సూట్‌కేసును తెరిచిన జేసీ.. అందులో ఆరు లక్షలు మాయం కావడంతో షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్‌పై అనుమానంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ డబ్బు తానే తీశానని, కారు సీటు కింద ఆ సొమ్మును దాచిపెట్టినట్టు చెప్పడంతో పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. నిన్న గౌతంను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.