whatsapp: వాట్సాప్ నుంచి డిజిటల్ పేమెంట్ సేవలు.. రెండు నెలల్లో రెడీ
- ఏడాది కాలంగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్
- మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో రంగంలోకి
- 30 కోట్ల మంది వినియోగదారులకు సౌలభ్యం
మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో రెండు నెలల్లో డిజిటల్ పేమెంట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి దిలీప్ అస్బే తెలిపారు. డిజిటల్ పేమెంట్ సేవల్లోకి అడుగుపెట్టిన వాట్సాప్ గత ఏడాది కాలంగా ప్రయోగాత్మకంగా కొందరు ఖాతాదారులకు అమలు చేస్తోంది. అయితే, వాట్సాప్ ఈ సేవలను పూర్తిస్థాయిలో ప్రారంభించినా వ్యవస్థలో నగదు చలామణిపై ప్రభావం చూపేందుకు దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉందని అస్బే తెలిపారు.
డేటాను స్థానికంగా నిల్వచేయాలన్న నిబంధనను పాటించేందుకు వాట్సాప్‌కు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాతే వాట్సాప్ ఈ సేవలను ప్రారంభించగలదని ఆస్బే వివరించారు. వాట్సాప్ కనుక ఈ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే దేశంలోని 30 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులకు ఈ సౌకర్యం లభించనుంది.