Crime News: భలే కేటుగాడు...కన్నం వేసిన ఇంటి పెద్దను పలకరించి మరీ చోరీ!
- తెల్లవారు జామున దొంగతనం
- ఇంటి యజమాని తల్లి అడిగిన దానికి సమాధానం
- 32 తులాల బంగారం, 6 లక్షల నగదుతో పరారు
ఈ దొంగ భలే కేటుగాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలిసి అర్ధరాత్రి చక్కగా ప్రవేశించాడు. దొరికిన డబ్బు, బంగారం, ఇతర వస్తువులు చేజిక్కించుకున్నాడు. వెళ్లిపోతుండగా మేడపై ఉంటున్న ఆ ఇంటి పెద్ద పలకరించగా ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పి చక్కగా చెక్కేశాడు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగింది.
పోలీసుల కథనం మేరకు...శ్రీకాకుళం పట్టణం కత్తెర వీధిలో మున్సిపాలిటీ లైసెన్స్డ్ సర్వేయర్ వాండ్రంగి శ్రీనివాసరావు కుటుంబంతో ఉంటున్నారు. కింద శ్రీనివాసరావు కుటుంబం ఉండగా, మేడపైన తన తల్లికి మరో గది ఏర్పాటు చేశారు. గత శుక్రవారం శ్రీనివాసరావు ఒడిశాలోని పూరికి కుటుంబంతో వెళ్లారు. తల్లిని తీసుకువెళ్లక పోవడంతో ఆమె మాత్రం మేడపై గదిలో ఉంటున్నారు.
ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో శ్రీనివాసరావు తల్లి దమయంతి మేడపై నుంచి చూడగా కొడుకు ఇంటి వసరాలో ఓ వ్యక్తి కనిపించాడు. దీంతో ‘ఎవరు నువ్వు? బాబు నిన్ను పడుకోమన్నాడా?’ అంటూ ఆమె ప్రశ్నించడంతో అవునంటూ సమాధానమిచ్చి నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు.
ఉదయం ఐదు గంటల సమయంలో పాలవాడు రావడంతో మేడ దిగిన దమయంతికి ఇంటి తలుపులు తెరిచి ఉండడం, గడియ విరగ్గొట్టి ఉండడంతో అనుమానం వచ్చి కొడుక్కి ఫోన్లో సమాచారమిచ్చింది. అనంతరం స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి సమాచారంతో హుటాహుటిన పట్టణం చేరుకున్న శ్రీనివాసరావు ఇంట్లో పరిశీలించగా 32 తులాల బంగారం, 6 లక్షల నగదు, కొంత వెండి మాయమైనట్టు గుర్తించి ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పక్కపక్కనే ఇళ్లుండగా ఇంత పక్కాగా దొంగతనం చేశాడంటే చోరీల్లో ఆరితేరిన వ్యక్తే అయివుంటాడని పోలీసులు భావిస్తున్నారు.