Terrorists: పేరు మార్చుకుని ఇండియాలో విస్తరిస్తున్న జమాతుల్ ముజాహిద్దీన్: ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ
- శరణార్థుల ముసుగులో ప్రవేశించిన ఉగ్రవాదులు
- పలు రాష్ట్రాల్లో మకాం వేశారన్న వైసీ మోదీ
- సవాళ్లను ఎదుర్కునేందుకు సిద్ధమని వెల్లడి
- నేటి నుంచి న్యూఢిల్లీలో కీలక సమావేశం
బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిద్దీన్, ఇండియాలో విస్తరిస్తోందని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) చీఫ్ యోగేశ్ చందర్ మోదీ తెలియజేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థుల రూపంలో వీరు ఇండియాలోకి ప్రవేశించారని చెబుతూ, 25 మంది పేర్లను ఆయన విడుదల చేశారు. వీరంతా బీహార్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో తిష్ట వేశారని అన్నారు. ఇండియాను అస్థిర పరిచేలా ఉగ్రదాడులు చేయడమే వీరి కర్తవ్యమని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్), ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్)లను ఇప్పటికే అప్రమత్తం చేశామని తెలిపారు.
వారి నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని, చొరబడిన ఉగ్రవాదులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారన్న విషయాన్ని ఓ కంట కనిపెట్టేందుకు పలు టీమ్ లు రంగంలోకి దిగాయని అన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ ఏజన్సీల సహకారాన్ని తీసుకుంటున్నామని చెప్పారు.
కాగా, దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు అమలవుతున్న తీరు, ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఏటీఎస్, ఎస్టీఎఫ్ చీఫ్ ల రెండు రోజుల సమావేశం నేడు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్న అంతర్జాతీయ సంస్థల పనితీరుపై డిజిటల్ సాక్ష్యాల సేకరణ అంశంపైనా ఈ సదస్సులో చర్చ సాగనుంది.