Mitchel Marsh: అవుటైన కోపంలో అసహనం.. చేత్తో గోడను కొట్టి గాయపడ్డ మిచెల్ మార్ష్!
- తస్మానియాతో జరిగిన పోటీలో అవుటైన మిచెల్
- పెవిలియన్ కు చేరి అసహనాన్ని చూపిన క్రికెటర్
- చీలిన మణికట్టుతో మిగతా మ్యాచ్ లకు దూరం
యాషెస్ సిరీస్ లో భాగంగా జరిగిన చివరి టెస్టులో ఐదు వికెట్లు తీసి సత్తా చాటిన ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, తన స్వీయ తప్పిదం కారణంగా గాయపడ్డాడు. ప్రస్తుతం షెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మిచెల్, పెర్త్ లో తస్మానియాతో జరిగిన పోటీలో హాఫ్ సెంచరీ అనంతరం బర్డ్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఆపై తీవ్ర నిరాశతో పెవిలియన్ కు వెళ్లిన మిచెల్, తన డ్రస్సింగ్ రూమ్ లో కుడిచేత్తో గోడను బలంగా కొట్టాడు. ఆపై నొప్పితో విలవిల్లాడి పోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా, వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మణికట్టు చీలినట్లు తేల్చారు. దీంతో అతను మిగతా మ్యాచ్ లకు దూరం కాక తప్పనిసరి పరిస్థితి. అతని చేతికి అయిన గాయం తీవ్రమైనదేనని జట్టు యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక చేజేతులా తప్పు చేసి గాయాల పాలైన మిచెల్ మార్ష్ వైఖరిపై ఇతర ఆటగాళ్లలో పెద్ద చర్చే జరుగుతోంది.