Uttar Pradesh: మూడు అడుగుల లోతులో కుండలో ఆడ శిశువు.. ఆసుపత్రికి తరలింపు!

  • యూపీలోని బరేలీలో ఘటన
  • ఓ పసిగుడ్డును ఖననం చేసేందుకు గుంత తవ్వుతుండగా అందులో మరో శిశువు
  • ప్రాణాలతో బయటపడిన పాప

పురిట్లోనే మృతి చెందిన తన శిశువును ఖననం చేయాలని తీసుకెళ్లిన ఓ తండ్రికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఖననం చేసేందుకు మూడడుగుల గుంత తవ్వగా.. అందులో ఓ కుండలో ఉన్న మరో శిశువు కనపడింది. ఆ పసిపాప ఇంకా ప్రాణాలతోనే ఉందని గుర్తించాడు.

వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన హితేశ్ కుమార్ సిరోహి అనే వ్యాపారి భార్య నెలలు నిండకుండానే (ఏడో నెలలో) ఓ శిశువు జన్మనిచ్చింది. అయితే, ఆ కాసేపటికే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. దీంతో బంధువులతో కలిసి ఖననం చేసేందుకు శ్మశానానికి వెళ్లాడు. అక్కడ గుంత తవ్వుతుండగా మూడడుగుల లోతులో ఓ కుండను గుర్తించి దాన్ని బయటకు తీశారు. అందులోనే మరో శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కనపడింది.  

కుండలోంచి ఆ పాపను తీసి వెంటనే పాలు పట్టించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, ఆ పాపకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఆ పాప వైద్య ఖర్చులకు స్థానిక ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా సాయం చేస్తున్నారు. కాగా, సిరోహి భార్య వైశాలి బరేలీలో ఎస్సైగా పనిచేస్తోందని ఆ నగర ఎస్సీ అభినందన్ సింగ్ తెలిపారు. ఆ శిశువును కుండలో ఉంచి ఎవరు పాతిపెట్టారో ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News