congress: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... మహారాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య వార్
- రాహుల్ ఎన్నికల ర్యాలీలో కనిపించని మిలింద్ దేవరా
- ఎందుకు హాజరు కాలేదంటూ సంజయ్ నిరుపమ్ ప్రశ్న
- ఆ నికమ్మా ఎందుకు హాజరు కాలేదని ప్రశ్న
లోక్ సభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర కాంగ్రెస్ లో రాజుకున్న కుంపటి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కొనసాగుతోంది. ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ అంతకు ముందు ఆ పదవిలో ఉన్న మిలింద్ దేవరా మధ్య నెలకొన్న కుమ్ములాట మళ్లీ బహిర్గతమైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొంటున్న సమయాల్లో సంజయ్ నిరుపమ్ తాను పాల్గొనటం లేదని ముందే ప్రకటించానని తెలిపారు.. ఈ నేపథ్యంలో రాహుల్ ముంబైలోని ధారవిలో ఆదివారం జరిపిన ర్యాలీలో పాల్గొనలేదన్నారు.
మరోవైపు మిలింద్ దేవరా కూడా రాహుల్ ర్యాలీకి డుమ్మా కొట్టడంతో నిరుపమ్ తీవ్ర స్థాయిలో మండి పడుతూ.. మిలింద్ ను నికమ్మా (పనికిరాని మనిషి) అంటూ.. ర్యాలీలో ఎందుకు పాల్గొనలేదని.. ఘాటుగా ట్వీట్ చేశారు. ‘రాహుల్ గాంధీ ర్యాలీల్లో నేను పాల్గొనటంపై అంచనాలు. అనుమానాలు అనవసరం. ముఖ్యమైన కుటుంబ కార్యాలుండటంతో దినమంతా నేను బిజీగా ఉన్నాను. రాహుల్ మా నాయకుడు. అదేవిధంగా మిలింద్ కు కూడా నాయకుడు. మరి ఆ నికమ్మా ఎందుకు ర్యాలీకి హాజరుకాలేకపోయాడు’ అని ట్వీట్ చేశారు.
నిజానికి నిరుపమ్ గత వారంలోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 21న పోలింగ్ జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిఫారసు చేసిన అభ్యర్థులను అధిష్ఠానం తిరస్కరించడంతో నిరుపమ్ కినుక వహించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నాడు. సాధారణ ఎన్నికలకు ముందు ముంబై కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న మిలింద్ దేవరాను తొలగించి అధిష్ఠానం సంజయ్ నిరుపమ్ ను నియమించింది. రాహుల్ ర్యాలీల్లో ఇద్దరు మహారాష్ట్ర నేతలు గైర్హాజరు కావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా ఇతర బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎన్నికలకు ముందే చేతులెత్తేసిందని విమర్శలు చేస్తున్నారు.