Uttar Pradesh: గోశాలలో అక్రమాల పుట్ట.. కలెక్టర్ సహా ఐదుగురిపై వేటేసిన యూపీ సీఎం ఆదిత్యనాథ్
- మాధవాలియా గోశాలలో అక్రమాలు
- లేని ఆవులకు పశుగ్రాసం పేరిట సర్కారు నిధుల స్వాహా
- గోశాలల పేరిట 328 ఎకరాలను అక్రమంగా కట్టబెట్టిన వైనం
గోవులను పరిరక్షించడంలో విఫలమయ్యారంటూ కలెక్టర్ సహా ఐదుగురు అధికారులపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేటేశారు. మహారాజ్‌గంజ్ జిల్లాలోని మాధవాలియా గోశాలలోని ఆవుల బాగోగులు చూసుకోవడంలో విఫలం కావడంతోపాటు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్కే తివారీ తెలిపారు.
గోశాలపై వస్తున్న ఆరోపణలపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన గోరఖ్‌పూర్ డివిజనల్ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలోని కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ గోశాలలో అధికారిక లెక్కల ప్రకారం 2500 ఆవులు ఉండాలి. అయితే, కేవలం 954 గోవులు మాత్రమే ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే, గోశాలకు 500 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 328 ఎకరాలను గోశాలల పేరిట రైతులకు అక్రమంగా కట్టబెట్టిన విషయం కూడా దర్యాప్తులో వెలుగుచూసింది.
లేని ఆవులకు పశుగ్రాసం పేరిట ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తుండడంతో స్పందించిన సర్కారు.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టరు అమర్నాథ్ ఉపాధ్యాయ, నామినేటెడ్ సభ్యుడు దేవేంద్రకుమార్, అధికారులు సత్యం మిశ్రా, పశుసంవర్ధకశాఖ వైద్యుడు డాక్టర్ రాజీవ్ ఉపాధ్యాయ, డాక్టర్ వీకే మౌర్యలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.