Amit Shah: గంగూలీతో బీజేపీ ఎటువంటి ఒప్పందమూ చేసుకోలేదు: అమిత్ షా
- గంగూలీ బీజేపీలో చేరాలనుకుంటే స్వాగతం పలుకుతాం
- బీసీసీఐ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్న విషయంపై నేను నిర్ణయం తీసుకోలేదు
- ఈ ఎన్నికలో బీసీసీఐకి సొంత ప్రక్రియ ఉంది
టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరాలనుకుంటే స్వాగతం పలుకుతామని, అయితే, తాము ఆయనతో ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి ఒప్పందమూ చేసుకోలేదని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో ఆయన భవిష్యత్తులో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని వస్తున్న పుకార్లను షా కొట్టిపారేశారు. గంగూలీ ఈ బాధ్యతలు చేపట్టే విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ... 'బీసీసీఐ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్న విషయంపై నేను నిర్ణయం తీసుకోలేదు. అధ్యక్షుడి ఎన్నికలో బీసీసీఐకి సొంత ప్రక్రియ ఉంది. గంగూలీ ఎప్పుడైనా సరే నా వద్దకు వచ్చి మాట్లాడవచ్చు. ఆయన నాతో సమావేశమైతే వచ్చే నష్టం ఏమీ లేదు. బీజేపీలో చేరాలని ఆయనను మేము ఎన్నడూ కోరలేదు. అలాగే, బీజేపీలో చేరనని కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి కొత్తగా సమర్థవంతమైన నాయకుడి అవసరం ఏమీలేదు. మేము ఇప్పటికే ఆ రాష్ట్రంలో 18 లోక్ సభ స్థానాల్లో గెలిచాం' అని వ్యాఖ్యానించారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం ఇచ్చినందుకు 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పనిచేస్తారని వస్తున్న ప్రచారంలో నిజం లేదని అమిత్ షా అన్నారు. ఆయనతో తాము ఇటువంటి ఒప్పందం ఏమీ చేసుకోలేదని చెప్పారు. 'బీజేపీలో గంగూలీ చేరతానంటే స్వాగతం పలుకుతా. దేశంలోని ఏ పౌరుడైనా సరే ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలనుకుంటే వారికి బీజేపీయే సరైంది' అని అన్నారు.