Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్ అరెస్ట్.. తోపులాటలో కిందపడ్డ ఏసీపీ
- ఆర్టీసీ కార్మికులతో కలిసి సమ్మెలో కూర్చున్న బండి సంజయ్
- పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం
- ఉద్రిక్తంగా మారిన వాతావరణం
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. వివిధ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నేతలు కూడా సంఘీభావం ప్రకటిస్తుండటంతో సమ్మె ఉద్ధృతమవుతోంది. తాజాగా కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమ్మెకు బీజేపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ తో పాటు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు ఆర్టీసీ కార్మికులతో పాటు సమ్మెలో కూర్చున్నారు. ఈ సందర్భంగా సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు.
సంజయ్ ను తీసుకెళ్లకుండా పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుగా పడుకున్నారు. వారిని అడ్డుతొలగించి పోలీసు వాహనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయినా కిలోమీటర్ మేర పరుగులు తీసి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీజేపీ కార్యకర్తల తోపులాటలో ఏసీపీ అశోక్ కుమార్ కిందపడిపోయారు. కానిస్టేబుళ్లు ఆయనను పైకి లేపారు. అయితే, బండి సంజయ్ మధ్యలో కలగజేసుకుని సర్దిచెప్పడంతో... పరిస్థితి అదుపులోకి వచ్చింది.