health: తక్కువ సమయం నిద్రపోతున్నారా?.. 'జాగ్రత్త' అంటున్న పరిశోధకులు
- నిద్రలేమితో జంక్‌ఫుడ్ అలవాటు
- మధుమేహ రోగుల్లో కంటిచూపుపై ప్రభావం
- కంటినిండా నిద్ర అవసరమంటున్న పరిశోధకులు
పని ఒత్తిళ్లు, మారుతున్న జీవన శైలి వంటి అనేక కారణాలతో నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తక్కువ సమయం నిద్రించే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే చాలా పరిశోధనలు తేల్చాయి. తాజాగా, పరిశోధకులు మరిన్ని విషయాలను గుర్తించారు. ఇటువంటి వారు జంక్ ఫుడ్ బాగా తింటున్నారని అమెరికాలోని నార్త్‌వెస్టెర్న్ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అలాగే, నిద్రలేమితో సతమతమవుతున్న మధుమేహ రోగుల్లో కంటిచూపు దెబ్బతినే అవకాశాలు అధికమని తైవాన్ పరిశోధకులు గుర్తించారు.
రాత్రుళ్లు తక్కువ సమయం నిద్రపోతున్న వారు ఉదయాన్నే జంక్‌ఫుడ్ తినేందుకే ఇష్టపడుతున్నారు. ముక్కులోని ఘ్రాణ గ్రాహకాల కారణంగా వారి మనసు వాటిపైకి లాగుతోందని తేల్చారు. 29 మందిపై పరిశోధకులు నాలుగువారాల పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. రోజుకు 4 గంటలే నిద్రపోయేవారు జంక్‌ఫుడ్‌కు అలవాటుపడి, వాటిని బాగా లాగించేశారు. అందుకే ప్రతిరోజు 8 గంటలు నిద్రపోతే ఈ బాధలు ఉండవని చెబుతున్నారు.
ఇక, మధుమేహ రోగుల్లో నిద్రలేమి ఉంటే వారి కంటిచూపు దెబ్బతింటుందట. ఎనిమిదేళ్ల పాటు చేసిన అధ్యయనం ఫలితంగా ఇలాంటి పలు వివరాలు వెల్లడయ్యాయి. ఇటువంటి వారిలో రక్తంలో ఆక్సిజన్ మోతాదు పడిపోతుందని, దీంతో కంటిలోని రక్తనాళాలు చిట్లిపోతున్నాయని పరిశోధకులు తేల్చారు. వాటి నుంచి వెలువడే ద్రవ సమ్మేళనం రెటీనాను కప్పేసి ఉంచుతుందని, దీని వల్ల దృష్టిలోపం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.