Netherlands: సమాజానికి దూరంగా.. తొమ్మిదేళ్లుగా ఎవరికీ కనపడకుండా ఒంటరిగా జీవిస్తున్న కుటుంబం!

  • చెట్ల మధ్య ఉండే పాత ఫామ్ హౌస్ లోని సెల్లార్ లో జీవనం
  • తొమ్మిదేళ్లుగా క్షవరం కూడా చేసుకోని వైనం  
  • పారిపోయి బయటకు వచ్చిన ఓ యువకుడు 
  • నెదర్లాండ్ లోని ద్రెంత్ ప్రావిన్స్ లో సినిమాను తలపించే ఘటన

సినిమా కథను తలదన్నేలా ఉన్న ఓ నిజజీవిత కథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం సమాజానికి దూరంగా.. తొమ్మిదేళ్లుగా ఎవరికీ కనపడకుండా ఒంటరిగా జీవిస్తోంది. వారిలో కొందరికి అసలు బయట మరో ప్రపంచం ఉందన్న విషయం కూడా తెలియదు. వారు అలా జీవించడానికి వెనుక ఉన్న రహస్యాలు ఏంటో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలుస్తున్న ఒక్కో విషయం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురి చేసేలా ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నెదర్లాండ్ లోని ద్రెంత్ ప్రావిన్స్ లో రుయినెర్ వోల్డ్ కు సమీపంలో ఉండే ఫామ్ హౌస్ వద్దకు ఎవ్వరూ రారు. దానికి సెల్లార్ లో ఓ రహస్య గది ఉంది. దానిలోంచి బయటకు రాకుండా  58 ఏళ్ల వ్యక్తి సహా ఆరుగురు నివసిస్తున్నారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఆ వ్యక్తి.. ఐదుగురు పిల్లలను అందులో పెంచుతున్నాడు. వారిలో 25 ఏళ్ల యువకుడు అక్కడి నుంచి తప్పించుకుని, దగ్గరలోని పబ్ కు వెళ్లి, ఐదు బీర్లు తాగాడు.

ఆ సమయంలో అతడిని గుర్తించిన పబ్ యజమాని.. అతడితో మాట్లాడి పలు వివరాలు రాబట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతడి జుట్టు చాలా పొడవుగా ఉందని, మాసిన గడ్డంతో, చిరిగిన బట్టలతో అతడు ఉన్నాడని పబ్ యజమాని చెప్పాడు. తొమ్మిదేళ్లుగా తాను ఓ రహస్య గదిలో ఉంటున్నానని, తన తమ్ముళ్లు, చెల్లెళ్లు కూడా అక్కడే ఉంటున్నారని చెప్పాడని తెలిపాడు. తాను అందులో ఇక జీవించలేనని ఆ యువకుడు చెప్పాడని అన్నాడు.  

 పబ్ యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ ప్రారంభించి పలు విషయాలు గుర్తించారు. అయితే, వారంతా అలా ఎందుకు జీవిస్తున్నారన్న విషయం మాత్రం అంతుపట్టని రహస్యంగానే ఉంది. వారు ఉంటున్న గదిని పోలీసులు వెతుక్కుంటూ వెళ్లారు. ఆ ఫామ్ హౌస్ సెల్లార్ లోకి వెళ్లేందుకు ఉన్న మెట్లు ఎవరికీ కనపడని రీతిలో పలు వస్తువులతో కప్పి ఉన్నాయని గుర్తించారు.

చివరకు లోపలికి వెళ్లిన పోలీసులు ఓ గదిని చూశారు. కప్ బోర్డుతో పాటు పలు సామగ్రి ఆ గదిలో ఉన్నాయి. ఈ గదిలోని ఉంటున్న వారిలో ఒకరికి 58 ఏళ్లు కాగా మిగతా ఐదుగురు 18 నుంచి 25 ఏళ్ల వారేనని పోలీసులు గుర్తించారు. చెట్ల మధ్య ఉండే ఓ పాత ఫామ్ హౌస్ లోని సెల్లార్ లో వారు ఇన్నేళ్లుగా జీవిస్తున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లుగా వారు క్షవరం కూడా చేసుకోలేదు.

అప్పుడప్పుడు అందులోంచి బయటకు వచ్చి అక్కడ పండే కూరగాయలను వారు తీసుకెళ్తున్నారని పోలీసులకి తెలిసింది. వారిలోని 58 ఏళ్ల వ్యక్తి.. మిగతా వారికి బయటి ప్రపంచాన్ని పరిచయం చేయకుండా ఇలా చేశాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఇలా ఎందుకు చేస్తున్నాడన్న విషయం పోలీసులకు ఇంకా తెలియరాలేదు.

ఆ 58 ఏళ్ల వ్యక్తి ఆ పిల్లల తండ్రా? కాదా? అన్న విషయంపై కూడా స్పష్టత రాలేదు. కొందరు మాత్రం ఆ పిల్లలకు తండ్రి అతడేనని చెబుతుంటే, ఈ విషయాన్ని ఇంకా నిర్థారించుకోలేదని పోలీసులు అంటున్నారు. కొంత కాలంగా అతడు అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడని పోలీసులకు తెలిసింది. ఆ పిల్లలను ఆ గదిలో ఇన్నేళ్లు ఉంచి, బయటి ప్రపంచాన్ని పరిచయం చేయనందుకుగానూ అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతడు విచారణకు సహకరించట్లేదని, తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పట్లేదని పోలీసులు తెలిపారు.

మిగతావారందరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులోని వారంతా జీవితాంతం అక్కడే జీవించాలని భావించినట్లు పోలీసులకు తెలిసింది. ఆ పిల్లలు ఎన్నడూ పాఠశాలకు వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. ఆ పిల్లల తల్లి ఎవరన్న విషయంతో పాటు వారికి సంబంధించి అనేక విషయాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

ఆ ప్రాంతంలో ఆ కుటుంబాన్ని తాను ఇంతవరకు ఎన్నడూ చూడలేదని ఓ స్థానికుడు తెలిపాడు. అక్కడ మనుషులెవ్వరూ ఉండరని, కొన్ని జంతువులు మాత్రమే కనపడేవని అన్నాడు. అక్కడి పోస్ట్ మేన్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రాంతానికి ఎన్నడూ పోస్టులు వంటివి రాలేదని, ఈ వారి జీవితం చాలా వింతగా ఉందని అన్నాడు. ఆ ఫామ్ హౌస్ కు చెందిన ఫొటోలను ఓ మీడియా సంస్థ, ఓ రిపోర్టరు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News