peacock: నెమలిని పెంచిన వ్యక్తిపై వన్యప్రాణి సంరక్షణ కేసు
- పంజరంలో ఉంచిన నెమలి స్వాధీనం
- జాతీయ పక్షిని పెంచడం నిబంధనలకు విరుద్ధమని వెల్లడి
- ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
సరదా కోసం నెమలిని పెంచుతున్న వ్యక్తికి అటవీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. జాతీయ పక్షిని నిబంధనలకు విరుద్ధంగా పెంచుతున్నారంటూ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. నెమలిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్ నివాసి సాజిద్ హుస్సేన్ మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్లినప్పుడు తెల్ల నెమలిని కొనుగోలు చేసి తెచ్చారు. పక్షులపై ఉన్న ప్రేమతో దానిని ఇంట్లో పెంచుతున్నారు.
ఈ విషయం ఆదిలాబాద్ అటవీ క్షేత్ర స్థాయి అధికారి అయ్యప్పకు తెలియడంతో అధికారులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. నెమలిని పెంచుతున్నది వాస్తవమేనని గుర్తించి పక్షిని స్వాధీనం చేసుకున్నారు. సాజిద్ హుస్సేన్‌పై కేసు నమోదు చేస్తున్నామని, నెమలిని అటవీ ప్రాంతంలో విడిచి పెడతామని తెలిపారు. అటవీ జంతువులు, పక్షులను పెంచడం నేరమని, ఎవరు చేసినా కేసునమోదు చేస్తామని స్పష్టం చేశారు.