Jagan: జగన్ కాన్వాయ్ వెళ్తుండగా నిరసన చేపట్టిన రాయలసీమ అడ్వొకేట్లు
- హైకోర్టును రాయలసీమకు తరలించాలని సెక్రటేరియట్ వద్ద నిరసన
- జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్
- సీఎంను కలిసేంత వరకు వెళ్లేది లేదని స్పష్టీకరణ
హైకోర్టును రాయలసీమకు తరలించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత న్యాయవాదులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో న్యాయవాదులు ఈరోజు సచివాలయానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తుండగా నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టును రాయలసీమకు తరలించాలనే ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంత అడ్వొకేట్లు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలంటే హైకోర్టును రాయలసీమకు తరలించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు కోస్తాలోనే ఉండాలని ఆ ప్రాంత న్యాయవాదులు కోరితే... రాజధానిని రాయలసీమకు తరలించాలని అన్నారు. శ్రీభాగ్ ఒప్పందం మేరకు హైకోర్టును సీమకు తరలించాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలివ్వడం, అధికారంలోకి రాగానే హామీలను పట్టించుకోకపోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయిందని విమర్శించారు.
రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను అమరావతిలో పెట్టింది టీడీపీ అని... అందుకే ఆ పార్టీని సంప్రదించలేదని చెప్పారు. సీఎం జగన్ ను కలిసేంత వరకు సెక్రటేరియట్ నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. హైకోర్టు తరలింపుపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.