Kim Jong un: తెల్లటి గుర్రంపై ప్రమాదకర పర్వతాలపై కిమ్ జోంగ్ ఉన్ స్వారీ
- తెల్లని మంచుతో కప్పి ఉండే 'పయేక్టు' పర్వతంపై కిమ్
- ఏ మాత్రం భయపడకుండా సాహస యాత్ర
- కొరియా చరిత్రలోనే ఇది అద్భుత ఘట్టమన్న ఉ.కొరియా మీడియా
ఉత్తర కొరియాలోని ప్రమాదకర పర్వతం 'పయేక్టు'పై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గుర్రంపై స్వారీ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు బయటకు వచ్చాయి. తెల్లని మంచుతో కప్పి ఉండే ఆ పర్వత అందాలను కిమ్ ఆస్వాదించారని ఆయన సహాయకుడు చెప్పారు. ఒంటరిగా తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ఆయన హాయిగా ఇలా ఈ పర్వతాలపై గడపడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కొరియా చరిత్రలోనే ఇది ఓ అద్భుత ఘట్టమని అక్కడి మీడియా పేర్కొంది. అది చాలా ప్రమాదకరమైన పర్వతమయినప్పటికీ ఆయన దాన్ని ఎక్కారని తెలిపింది.
కిమ్ జోంగ్ ఉన్ ఏ మాత్రం భయపడకుండా ఈ యాత్రను పూర్తి చేశారు. సాధారణంగా ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇటువంటి యాత్రలు చేస్తారు. ఈ సాహసయాత్ర పూర్తి చేసిన ఆయన ఏదైనా కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలో ఆధ్యాత్మికంగా కిమ్ వంశానికి చాలా ప్రధానమైన పర్వతం ఇది.