drone: భారత భూభాగంలోకి పాక్ డ్రోన్
- పంజాబ్‌లో కనబడిన డ్రోన్
- భారత భూభాగంలోకి కిలోమీటరు చొచ్చుకొచ్చిన వైనం
- వారం రోజుల పరిధిలో రెండోసారి ఘటన
పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. పంజాబ్‌లోని పాక్ సరిహద్దు సమీపంలో ఆ దేశానికి చెందిన డ్రోన్ చక్కర్లు కొట్టింది. హజారాసింగ్ వాలా, బక్డీ ప్రాంతంలో పాక్ డ్రోన్ కనపడిందని గ్రామస్థులు చెప్పారు. అది పాక్ నుంచి భారత గగనతలంలోకి వచ్చిందని తెలిపారు. బీఎస్‌ఎఫ్ హెచ్‌కే టవర్ సమీపంలో పంట పొలాల మీదుగా దాదాపు ఒక కిలోమీటరు వరకు ఇది దూసుకొచ్చిందని అధికారులు వివరించారు. అయితే, కాసేపటికే ఆ డ్రోన్ కనపడకుండా పోయిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ డ్రోను ద్వారా భారత భూభాగంలోకి పాక్ ఏమైనా జారవిడిచిందా? అనే విషయాన్ని గుర్తించడానికి బీఎస్ఎఫ్ ప్రయత్నిస్తోంది. కాగా, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ వద్ద వారం రోజుల క్రితం కూడా పాకిస్థాన్ కు చెందిన ఓ డ్రోన్ చక్కర్లు కొట్టి కలకలం రేపింది. అంతకు ముందు కూడా పలుసార్లు పాక్ ఇటువంటి చర్యలకు పాల్పడింది.