UNO: ఏసీలు, ఎస్కలేటర్ల వినియోగం తగ్గించాలి.. ఐక్యరాజ్యసమితి ఆఫీసులో కొత్త నిబంధనలు
- నిధుల లేమిలో ఐక్యరాజ్యసమితి
- సభ్య దేశాలు తమ వాటా నిధులివ్వకపోవడంతో సమస్య
- నిధులు అందకపోతే ఉద్యోగుల జీతాలు ఇవ్వలేము: సెక్రెటరీ జనరల్
ఐక్య రాజ్య సమితి నిధుల లేమి సమస్య నుంచి గట్టెక్కడానికి పొదుపు వ్యూహాలను అమల్లోకి తెస్తోంది. ఇందులో భాగంగా ఏసీలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్ ల వాడకాన్ని తగ్గించాలని తన ఉద్యోగులకు సూచించింది. కొత్తగా ఉద్యోగుల నియామకాల సంఖ్యను కూడా తగ్గించింది. నిధుల సమస్య తీరేవరకు ఈ నిబంధనలు అమలు చేస్తామని సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. ‘గత పదేళ్లలో ఇంతటి గడ్డు పరిస్థితిని చవిచూడలేదు’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు తమ వాటా ప్రకారం నిధులు చెల్లించకపోవడంతో సమస్య ఉత్పన్నమయిందని అన్నారు. 65 సభ్యదేశాలు 1.38 బిలియన్ డాలర్ల వరకు సమితికి బకాయి పడ్డారు. ఈ బకాయిలు చెల్లించకపోతే.. ఉద్యోగులకు జీతభత్యాలు కూడా చెల్లించలేమంటూ సెక్రెటరీ జనరల్ సభ్యదేశాలకు లేఖలు కూడా రాశారు.