Madhya Pradesh: మృతుని కళ్లపై నుంచి పాకుతున్న చీమలు!
- మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన
- ఐదుగురు డాక్టర్ల సస్పెన్షన్
- నిర్లక్ష్యానికి నిదర్శనమన్న ప్రతిపక్షాలు
మధ్యప్రదేశ్ లో ని ఓ ప్రభుత్వాసుపత్రిలో టీబీ వ్యాధితో మరణించిన ఓ వ్యక్తి కళ్లల్లో చీమలు పాకే వీడియో వైరల్ గా మారింది. పాకుతున్న చీమలను మృతుని భార్య చేత్తో తొలగిస్తున్న తీరు వీక్షకుల హృదయాలను కలిచి వేసింది.
టీబీతో బాధపడుతున్న 50 ఏళ్ల బాలచంద్ర లోది శివపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా ఐదుగంటల తర్వాత మృతి చెందాడు. వార్డులో ఉన్న ఇతర రోగులు బాల చంద్ర మృతి చెందాడని డాక్టర్లకు తెలిపినప్పటికి వారు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. బాలచంద్ర మరణించినప్పటికీ కళ్లు తెరిచే ఉండటంతో చీమలు కళ్ల మీదుగా పాకుతున్నాయి. చాలా సేపటివరకు సిబ్బంది స్పందించకపోవడంతో ఈ దృశ్యాన్ని ఎవరో మొబైల్ లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.
దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ వ్యాఖ్యానిస్తూ.. ఇది మానవత్వానికే మచ్చ అని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఒక సర్జన్ సహా నలుగురు డాక్టర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.