pakistan boarder: సరిహద్దులో పాకిస్థానీ చొరబాటుదారుడు హతం
- కాల్చి చంపిన బీఎస్ఎఫ్ జవాన్లు
- భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం
- వెనక్కి వెళ్లాలని హెచ్చరించినా నిరాకరించడంతో కాల్పులు
ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులో భారత బలగాలు నిన్న ఓ చొరబాటుదారుడిని కాల్చి చంపాయి. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు అతను చేసిన ప్రయత్నాన్ని నిలువరించేందుకు సరిహద్దు బలగాలు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో కాల్చి చంపాయి.
వివరాల్లోకి వెళితే...నిన్న సాయంత్రం భద్రతా బలగాలు చెక్‌పోస్టు వద్ద కాపలా కాస్తుండగా గేట్ నంబర్ 103 ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తూ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన సైనికులు అతన్ని వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. అయినా అతను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే చనిపోగా, అతని వద్ద బ్యాగులో జత దుస్తులు, సిమ్ కార్డు, మెమరీ కార్డు లభించాయి.
చనిపోయిన వ్యక్తిని గుల్నవాజ్‌గా జవాన్లు గుర్తించారు. ఘటనపై సరిహద్దులోని పాకిస్థాన్ జవాన్లకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. అయితే చొరబాటు దారుడిని కాల్చి చంపిన నేపథ్యంలో సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. అట్టారి రైల్వేస్టేషన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు.