TTD: మొరాయించిన టీటీడీ కంప్యూటర్ సర్వర్లు... భక్తుల తీవ్ర ఇబ్బందులు
- నిలిచిన సేవా టికెట్ల జారీ
- గంటల తరబడి వేచిచూసిన భక్తులు
- సమస్యను పరిష్కరించామన్న అధికారులు
తిరుమల తిరుపతి దేవస్థానం కంప్యూటర్ సర్వర్లు మొరాయించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పలు సేవలు, టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్ల జారీ నిలిచిపోయాయి. సర్వర్లను పునరుద్ధరించేందుకు గంటల సమయం పట్టడంతో, భక్తులు వేచి చూడాల్సి వచ్చింది. ఇంటర్నెట్ పని చేయలేదని, దానికి అనుసంధానంగా ఉన్న పనులన్నీ నిలిచిపోయాయని అధికారులు వెల్లడించారు. సమస్యను పరిష్కరించామని తెలిపారు.
కాగా, ఈ ఉదయం తిరుమలలో స్వామివారి సర్వదర్శనం నిమిత్తం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు 3 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతోంది. నిన్న స్వామివారిని 70,661 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,551 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లుగా నమోదైంది.