Jagan: జగన్ ను ఉద్దేశించి సీబీఐ వాడుతున్న భాషపై ఆయన లాయర్ అభ్యంతరం!
- జగన్ ను ఉద్దేశించి సీబీఐ వాడుతున్న భాష సరిగా లేదు
- ఇప్పుడు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
- గౌరవనీయ ముఖ్యమంత్రి అని సంబోధించాలి
ఏపీ ముఖ్యమంత్రిగా తాను చాలా బిజీగా ఉన్నానని... ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడం తనకు సాధ్యం కాదని... తన భద్రత కోసం ప్రభుత్వానికి ఖర్చు కూడా ఎక్కువవుతుందని... అందువల్ల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. జగన్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారని... కోర్టుకు హాజరుకాకుండా ఉంటే, సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొంది.
దీనిపై సీబీఐ కోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్ వాదిస్తూ, జగన్ ను ఉద్దేశించి సీబీఐ ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని... గౌరవనీయ ముఖ్యమంత్రి అని సంబోధించాలని సూచించారు. ఘాటు పదజాలాన్ని వాడటం సరికాదని అన్నారు. సీఎంగా ఉన్న జగన్ కు కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా సీబీఐ తరపు లాయర్ వాదిస్తూ, గతంలో కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని జగన్ పిటిషన్ వేశారని... ఆ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసిందని... ఇప్పుడు కూడా ఆ పిటిషన్ ను తిరస్కరించాలని కోరారు. ఇది ఆర్థిక నేరానికి సంబంధించిన కేసు అని... ఇలాంటి కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ, నవంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు.