Undavalli: స్థానిక సంస్థల ఎన్నికల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగితే జగన్ కు ఎదురుండదు: ఉండవల్లి అరుణ్ కుమార్
- జగన్ వైఎస్సార్ కుమారుడు అనే దశను దాటారని వెల్లడి
- వైసీపీ విజయం ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యలు
- పార్టీని నడపడంలో జగన్ అప్రమత్తంగా ఉండాలన్న ఉండవల్లి
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే దశను దాటిపోయి జగన్ గా ప్రజల్లో బలమైన ముద్ర వేయగలిగారని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయం సామాన్యమైంది కాదని పేర్కొన్నారు. ఆ స్థాయిలో ఫలితాలు వస్తాయని ఎవరూ ఊహించలేదని వివరించారు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో జగన్ ముందు పెను సవాల్ నిలిచి ఉందని, అందులో సత్తా చాటితే ఇక ఎదురుండకపోవచ్చని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విఫలమైతే మాత్రం ఎమ్మెల్యేలు ఎదురుతిరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత రానంత కాలం ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నా పెద్దగా బయటికి కనిపించదని, ఏదేమైనా జగన్ భవిష్యత్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయిస్తాయని ఉండవల్లి వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రభుత్వాన్ని నడపడం కంటే ఓ పార్టీని నడపడం చాలా కష్టమని, ఈ విషయంలో జగన్ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.