Jagan: చిదంబరం కేసు విచారణ సమయంలోనూ మీ కేసు ప్రస్తావనకు వచ్చింది సార్!: జగన్ పై వర్ల రామయ్య వ్యాఖ్యలు
- వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన జగన్
- తప్పుబట్టిన వర్ల రామయ్య
- ఎందుకు సార్ మీకు మినహాయింపు? అంటూ మండిపాటు
ఏపీ సీఎం జగన్ వైఖరి గర్హనీయం అంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. వర్ల రామయ్య ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి జగన్ పై విమర్శల జడివాన కురిపించారు.
"ఇంత తక్కువ వ్యవధిలోనే రూ.43 వేల కోట్లు ఎలా వచ్చాయి అంటూ 2012లోనే న్యాయస్థానం ప్రశ్నించింది, ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలని, ఆర్థిక నేరాల వెనుక లోతైన కుట్రల మూలాలు ఉంటాయని, ఇది ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారమని, దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఇలాంటి నేరాలు పెనుముప్పుగా పరిణమించాయని, ఆర్థిక నేరగాళ్లను శిక్షించకపోతే సమాజం నష్టపోతుందని 2013లో సుప్రీంకోర్టు చెప్పింది. ఇది మీ కేసు గురించే కదా సార్. ఇవే కాదు, అనేక కోర్టులు మీపై ఇలాంటి వ్యాఖ్యలే చేశాయి సార్. అంతెందుకు, చిదంబరం కేసు విచారణలో కూడా మీ కేసు ప్రస్తావనకు వచ్చింది సార్. ఎందుకు సార్ మీకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలి" అంటూ వర్ల రామయ్య నిలదీశారు.
నాంపల్లి సీబీఐ కోర్టులో అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సీఎం జగన్ కోరిన నేపథ్యంలో వర్ల పైవిధంగా స్పందించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం కంటే, నేను సీఎంగా ఉన్నాను, కేసుల విచారణ త్వరగా పూర్తిచేయించండి అని కోర్టును కోరితే బాగుండేదని వర్ల హితవు పలికారు. "రూ.43 వేల కోట్లు దోచుకున్నానని సీబీఐ నా మీద అభాండం వేసింది, త్వరగా విచారణ జరపమని కోరండి సార్. అప్పుడు మీరు నిర్దోషిగా బయటికి వస్తే ప్రజలు జేజేలు పలుకుతారు" అంటూ వ్యాఖ్యానించారు. అంతేతప్ప సీబీఐని భయపెట్టే రీతిలో గౌరవనీయ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడాన్ని తాము గర్హిస్తున్నామని, ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.