Narendra Modi: కాంగ్రెస్ ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరించింది: మోదీ ఎద్దేవా
- హర్యానా కాంగ్రెస్ పై విమర్శలు
- కాంగ్రెస్ నేతలు వీడియోలో ఒప్పుకున్నారన్న మోదీ
- 10-15 సీట్లు వస్తే గొప్పే అని మాట్లాడుకున్నారని వెల్లడి
హర్యానాలో కాంగ్రెస్ ఎన్నికలకు ముందే ఓటమిని ఒప్పుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ తన రెండో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రాంగణంలో ముగ్గురు కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ భవితవ్యంపై మాట్లాడుకుంటున్న వీడియోను ప్రస్తావించారు.
‘ ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో కాంగ్రెస్ పరిస్థితి మీకు అర్థమైందనుకుంటాను. మీరు వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు, కాంగ్రెస్ 10 నుంచి 15 స్థానాలు గెలుచుకుంటే గొప్పే అని వారు సంభాషించినట్లు తెలుస్తోంది. ఇవి ఎన్నికలకు ముందే వారన్న మాటలు. హర్యానాకు ఏమీ చేయకుండానే.. బరి నుంచి వారు విరమించారు’ అని చెప్పారు.
"ఆశ్చర్యకరమైనదేమిటంటే.. హర్యానా కాంగ్రెస్ నేత చేతులు కట్టుకుని ఇతర కాంగ్రెస్ నేతలకు బదులిస్తున్నాడు. సదరు నేతపట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చిత్రాలను మీరు వీడియోలో చూసి ఉంటారు. కాంగ్రెస్ లో ఉన్న నేతాగిరికి ఇది పరాకాష్ట. హర్యానాకు జరిగిన ఈ అవమానాన్ని మీరు సహిస్తారా?" అని మోదీ ప్రజలను ప్రశ్నించారు. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్ నాయక్ పార్టీని కూడా మోదీ విమర్శించారు. ప్రజలు ఆ పార్టీ రాజకీయాలు, వ్యూహాలను తిరస్కరించారని పేర్కొన్నారు.