america: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. దెబ్బతిన్న ఇంజిన్.. రూ.14 కోట్ల నష్టం!
- ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా నేతలకు రక్షణనిచ్చిన విమానం
- ల్యాండ్ అవుతున్న సమయంలో ఢీకొట్టిన పక్షి
- విమానం ఖరీదు రూ.10 వేల కోట్లకు పైనే
ఏంటీ.. అంత పెద్ద విమానాన్ని ఇంత చిన్న పక్షి ఢీకొడితే రూ.14 కోట్ల నష్టమా? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది నిజమే. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని పట్యుక్సెంట్ రివర్ నేవల్ ఎయిర్ స్టేషన్‌లో ఈ నెల 2న ఈ ఘటన జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. పక్షి కారణంగా దెబ్బతిన్న విమానానికి చాలా చరిత్ర ఉంది. ఈ-6బి మెర్క్యురీ రకం విమానమైన ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా నేతలకు రక్షణ కల్పించింది. అంతేకాదు, అణుదాడులకు కూడా దీనిని ఉపయోగించారు.
ఈ నెల 2న విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా నష్టం మాత్రం భారీగానే జరిగింది. విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతినడంతో ఏకంగా రూ.14 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. విమానం ఖరీదు పదివేల కోట్ల రూపాయలకు పైనే కాగా, ఈ ప్రమాదాన్ని వైమానిక దళం ఎ-క్లాస్ ప్రమాదంగా పేర్కొంది.