Tsrtc: టీఎస్సార్టీసీ బంద్ ఉద్రిక్తత.. తాత్కాలిక డ్రైవర్ ను చితకబాదిన కార్మికులు!
- బండ్లగూడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల బైఠాయింపు
- బస్సులను అడ్డుకుని టైర్లకు మేకులు కొట్టిన కార్మికులు
- కరీంనగర్, నిజామాబాద్ లోనూ కార్మికుల నిరసన
టీఎస్సార్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన తెలంగాణ బంద్ కొనసాగుతోంది. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగోల్ లోని బండ్లగూడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. బస్సులను అడ్డుకుని టైర్లకు మేకులు కొట్టిన కార్మికులు, తాత్కాలిక డ్రైవర్ ను చితకబాదారు. ఈ క్రమంలో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది.
నిజామాబాద్ జిల్లాలోని మక్లూర్ మండలం దాస్ నగర్ లోనూ ఉద్రిక్తత నెలకొంది. బస్సులపైకి ఆర్టీసీ కార్మికులు రాళ్లు రువ్వారు. ఆచన్ పల్లి, ముజారక్ నగర్ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు.
కరీంనగర్ లోనూ అవే పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ బస్టాండ్ ఎదుట బస్సుపై సీపీఎం నేతలు కర్రలతో దాడి చేశారు. బస్సు టైర్లలో గాలి తీసే యత్నం చేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.