East Godavari District: గోదావరి ఒడ్డుకి 200 మీటర్ల దూరంలో 50 అడుగుల లోతున బోటు
- కచ్చులూరు వద్ద మునిగిన బోటు స్పష్టంగా గుర్తింపు
- వెలికితీసేందుకు మరిన్ని ఏర్పాట్లు
- మెరైన్ డైవర్లను రప్పిస్తున్న అధికారులు
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన ‘రాయల్ వశిష్ట’ బోటు వెలికితీతలో మరింత పురోగతి కనిపించింది. బోటును వెలికితీసే పనిలో ఉన్న కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఇప్పటికే బోటును గుర్తించింది. లంగరు వేసి లాగే ప్రయత్నంలో రెయిలింగ్ ఊడి వచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రయత్నంలో బోటులోని డీజిల్ కూడా బయటపడి నదిపైకి తెట్టులా రావడం, ఆ ప్రాంతంలో బుడగలు కూడా వస్తుండడంతో మునిగిపోయిన బోటు అదేనని భావిస్తున్నారు. ప్రస్తుతం బోటు నది ఒడ్డుకు 200 మీటర్ల దూరంలో 50 అడుగుల లోతున ఉందని స్పష్టమైన నిర్థారణకు వచ్చారు.
కాకినాడ పోర్టు అధికారుల పర్యవేక్షణలో వెలికితీత పనులు చురుకుగా సాగుతున్నాయి. బోటు ఎక్కడ ఉందన్నది తేలినందున డైవర్ల ద్వారా బోటుకు లంగర్లు తగిలించి వెలికితీస్తే వేగంగా ఫలితం వస్తుందని ధర్మాడి సత్యం బృందం తెలియజేయడంతో విశాఖ నుంచి గజ ఈతగాళ్లను, డీప్ వాటర్ డైవర్లను రప్పిస్తున్నారు.
ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో వీరిని బోటు వద్దకు పంపించి బోటుకు లంగర్లు తగిలించాలన్నది వీరి ప్లాన్. ఇదంతా అనుకున్నట్టు జరిగితే ఒకటి రెండు రోజుల్లో బోటు బయటకు వస్తుందని భావిస్తున్నారు.