Swiggy: ఉపాధి కల్పనలో ముందుకు దూసుకుపోతున్న స్విగ్గీ!
- కొత్తగా 3 లక్షల మందిని తీసుకునేందుకు ప్రణాళిక
- ఇప్పటికే సంస్థలో రెండు లక్షల మంది ఉద్యోగులు
- టీసీఎస్ ను అధిగమించనున్న స్విగ్గీ
ఉద్యోగాల కల్పనలో ప్రముఖ ఆహార పదార్థాల డెలివరీ సంస్థ స్విగ్గీ ముందుకు దూసుకుపోతోంది. రానున్న 18 నెలల్లో మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తోంది. స్విగ్గీలో ఇప్పటికే 2 లక్షల మంది పని చేస్తున్నారు. తాజా నిర్ణయంతో స్విగ్గీ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలకు చేరుతుంది.
ఇదే జరిగితే.. దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న మూడో అతిపెద్ద సంస్థగా స్విగ్గీ నిలుస్తుంది. గత ఏడాది గణాంకాల ప్రకారం భారత సైన్యం 12.5 లక్షల ఉద్యోగులతో మొదటి స్థానంలో ఉండగా, రైల్వే 12 లక్షలతో రెండో స్థానంలో ఉంది. ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 4.5 లక్షలతో మూడో స్థానంలో ఉంది.
ఈ సందర్భంగా స్విగ్గీ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజెటీ తమ సంస్థలో కల్పించనున్న కొత్త ఉద్యోగాల వివరాలను ప్రకటిస్తూ.. సంస్థ వృద్ధికి సంబంధించిన అంచనాలు అనుకున్న విధంగా కొనసాగితే.. సైన్యం, రైల్వేల తర్వాత దేశంలో మూడవ అతి పెద్ద ఉపాధి వనరుగా స్విగ్గీ ఆవిర్భవించడం తథ్యమని అన్నారు. రానున్న 15 ఏళ్లలో పదికోట్ల మంది వినియోగదారులు ప్రతినెలా 15 రెట్లు తమ కంపెనీ ద్వారా లావాదేవీలు జరపాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన చెప్పారు.