Pakistan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రజల విశ్వాసం కోల్పోయారు: పీపీపీ అధినేత బిలావల్ భుట్టో
- నిరసనలు చేపడతామని వెల్లడి
- కశ్మీర్ విషయంలో విఫలమయ్యారని విమర్శలు
- నిజమైన ప్రజాస్వామ్యమే తమ లక్ష్యమన్న బిలావల్
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో ధ్వజమెత్తారు. దేశాన్ని పాలించే సామర్థ్యం ఇమ్రాన్ కు లేదని ఆయన విమర్శించారు. కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో ప్రధానిగా ఇమ్రాన్ విఫలమయ్యారని పేర్కొన్నారు. బిలావల్ లాహోర్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇమ్రాన్ రిగ్గింగ్ చేసి ప్రధానమంత్రి అయ్యారని ఆరోపించారు. దేశంలో అసలైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని బిలావల్ తెలిపారు.