Prakasam District: తిట్టిన కంప్యూటర్ ఆపరేటర్... ఆత్మహత్య చేసుకున్న గ్రామ వాలంటీర్!
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘటన
- ఇంటికి వచ్చి హెచ్చరించి వెళ్లిన ఆపరేటర్
- మనస్తాపంతో ఉరేసుకున్న జుబేద
తహసీల్దారు కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అకారణంగా దూషించాడన్న మనస్తాపంతో ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కలకలం రేపింది. బాధితురాలి కుటుంబీకులు వెల్లడించిన వివరాల ప్రకారం, షేక్ జుబేద (20) ఇటీవల గ్రామ వాలంటీర్ గా ఎంపికైంది. శుక్రవారం రాత్రి కంప్యూటర్ ఆపరేటర్ శివప్రసాద్ చారి, ఆమె ఇంటికి వచ్చి, రికార్డులు పూర్తి చేసి, శనివారం ఉదయానికి ఆఫీసుకు రావాలని ఆదేశించాడు. పని సరిగ్గా చేయడం లేదని, ఇలాగే ఉంటే ఉద్యోగం ఊడిపోతుందని అవమానకరంగా మాట్లాడాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, స్నానాల గదిలో ఇనుపరాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. శివప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.