ED: ఒక్క రాత్రి కోసం రూ. 7.7 కోట్లు ఖర్చు పెట్టిన రతుల్ పురి!
- గతంలో మోసర్ బేర్ సంస్థను నడిపిన రతుల్ పురి
- ఆ సమయంలో రూ. 8 వేల కోట్లు మళ్లించారని ఆరోపణ
- ఢిల్లీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పురి, అమెరికాలో ఒక్క రాత్రి గడిపేందుకు 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.70 కోట్లు) ఖర్చు చేశారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ, యూఎస్ లోని నైట్ క్లబ్ లో ఆయన లగ్జరీగా గడిపారని పేర్కొంది. ఈ కేసులో రతుల్ తో పాటు మోసర్ బేర్ ఇండియాలో పనిచేసిన ఉన్నతాధికారుల పేర్లనూ ఈడీ ఈ చార్జ్ షీట్ లో చేర్చింది.
"ప్రొవోకాటియర్ అనే నైట్ క్లబ్ లో ఓ రాత్రి గడిపిన రతుల్ పురి, అక్కడ 11,43,980 డాలర్లను ఖర్చు చేశారు. ఇందుకు సంబంధించిన లావాదేవీల వెరిఫికేషన్ పూర్తయింది" అని ఈడీ పేర్కొంది. నవంబర్ 2011 నుంచి అక్టోబర్ 2016 మధ్య పూరి వ్యక్తిగత ఖర్చు 4.5 మిలియన్లకు పైగానే ఉందని కూడా వెల్లడించింది.
ఈ కేసులో మొత్తం రూ. 8 వేల కోట్లు పక్కదారి పట్టిందని ఆరోపించిన ఈడీ, బినామీ కంపెనీలను సృష్టించారని, వాటి ద్వారా నిధులను తమ సొంతానికి వాడుకున్నారని తెలిపింది. మోసర్ బేర్ తరఫున అనుబంధ సంస్థలు, అసోసియేట్ కంపెనీల్లో రూ. 8,002 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని చెబుతూ, ఢిల్లీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది.