Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ నా స్నేహితురాలు.. ఒకే వర్సిటీలో చదివాం: నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ

  • 1980 కాలంలో ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలో చదువుకున్నాం
  • ఆమె చాలా తెలివైన వ్యక్తి
  • గతంలో కాంగ్రెస్ పై కూడా విమర్శలు చేశాను

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి తాను 1980 కాలంలో ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలో చదువుకున్నానని, ఆమె తన స్నేహితురాలేనని ఆర్థిక వేత్త, నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ తెలిపారు. రాజకీయాల విషయంలో తనకున్న అభిప్రాయాలు, ఆమె అభిప్రాయాలు ఒకే రకంగా ఉండేవని చెప్పారు. ఆమె చాలా తెలివైన వ్యక్తి అని ఆయన అన్నారు.

జేఎన్యూలో అభిజిత్ బెనర్జీ 1983లో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. అదే వర్సిటీలో 1984లో సీతారామన్.. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్, ఎంఫిల్ పూర్తి చేశారు. భారత్ గురించి జేఎన్యూ తనకు చాలా నేర్పించిందని అభిజిత్ బెనర్జీ అన్నారు. తనకు నోబెల్ బహుమతి వచ్చిన నేపథ్యంలో సీతారామన్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

భారత ఆర్థిక వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నుంచి వస్తున్న విమర్శలపై అభిజిత్ బెనర్జీ స్పందించారు. 'నేను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను కూడా వారు గమనించాలి. నేను గత ప్రభుత్వంపై కూడా చాలా విమర్శలు చేశాను' అని అన్నారు.

కాగా, ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డఫ్లోతో పాటు మరో ఆర్థిక వేత్త మైఖేల్ క్రెమెర్‌ ఎంపికైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం వారు కృషి చేశారు.

  • Loading...

More Telugu News