MAA: 'మా' సమావేశం రసాభాస... వాకౌట్ చేసిన సభ్యులు!
- వాడీవేడిగా మాటల యుద్ధం
- నరేశ్, రాజశేఖర్ వర్గాల మధ్య వాదోపవాదాలు!
- ఇటీవలే బాధ్యతలు అందుకున్న కొత్త కార్యవర్గం
తెలుగు చిత్రసీమలో నటీనటుల కోసం ఏర్పడిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో వివాదాలు మరింత తీవ్రరూపు దాల్చాయి. ఇవాళ హైదరాబాద్ లో 'మా' సమావేశం నిర్వహించారు. కొన్ని అంశాల్లో సభ్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు మా గౌరవ సలహాదారు కృష్ణంరాజు వివరించారు. అయితే, 'మా' అధ్యక్షుడు నరేశ్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ వర్గాల మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం సాగింది. ఓ దశలో సమావేశంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓ సీనియర్ సినీ ప్రముఖుడు కంటతడి పెట్టుకుంటూ సమావేశం నుంచి నిష్క్రమించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ సమావేశానికి రావాలంటూ సభ్యులకు జీవితా రాజశేఖర్ మెసేజ్ లు పంపడం నరేశ్ వర్గాన్ని అసంతృప్తికి గురిచేసింది. అధ్యక్షుడు లేకుండా 'మా' సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ఆ వర్గం ప్రశ్నిస్తోంది. అయితే ఇది మా జనరల్ బాడీ సమావేశం కాదని, స్నేహపూర్వక సమావేశం అని జీవిత వివరణ ఇచ్చారు.
మరోవైపు, కొత్తగా కార్యవర్గం బాధ్యతలు చేపట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిధుల సేకరణ జరగడంలేదంటూ రాజశేఖర్ వర్గం నరేశ్ వర్గంపై అసహనం వ్యక్తం చేస్తోంది. గతంలో మా కార్యవర్గం మూలధనాన్ని కదపకుండా, ఈవెంట్లు నిర్వహించి నిధులు సేకరించేదని, ఇప్పటి అధ్యక్షుడు నరేశ్ మూలధనం నుంచే ఖర్చు చేస్తున్నారని రాజశేఖర్ వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా సమావేశం రసాభాస కాగా, కొందరు సభ్యులు వాకౌట్ చేసినట్టు తెలుస్తోంది.