CM Jagan: పోలీసు అమర వీరులకు నివాళులర్పించిన సీఎం జగన్.. ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని సూచన!
- విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సంస్మరణ దినం
- గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి
- హోంగార్డు విధుల్లో మరణిస్తే రూ.5 లక్షల పరిహారమని ప్రకటన
సామాన్యుడు కూడా పోలీసులంటే చెయ్యెత్తి జైకొట్టేలా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు, గౌరవాన్ని పొందాలని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఉదయం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
తొలుత ఆయన అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి, పగలన్న తేడా లేకుండా విధులు నిర్వహించే పోలీసులు బాధ్యతల నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతుంటారన్నారు. అటువంటి వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పారు.
అంతటి త్యాగశీలులైన పోలీసులు వారంలో ఒక్కరోజైనా తమ కుటుంబంతో సంతోషంగా గడపాలన్న ఉద్దేశంతో వీక్లీ ఆఫ్ ప్రకటించినట్లు తెలిపారు. ప్రజలందరికీ సమన్యాయం జరిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. హోంగార్డు కూడా విధుల్లో ఉంటూ చనిపోతే రూ.5 లక్షల పరిహారం కుటుంబానికి అందజేస్తామని తెలిపారు.