Single Use Plastic: పూలదండ కోసం ప్లాస్టిక్ కవర్ వాడిన ప్రిన్సిపాల్.. జరిమానా విధించిన జిల్లా కలెక్టర్
- ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్
- సింగిల్ యూజ్ కవర్లు, బాటిళ్ల వాడకంపై ఆగ్రహం
- ప్రిన్సిపాల్ కు రూ. 1000 జరిమానా
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా ఆపివేయాలనే దిశగా మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా కలెక్టర్ ఛోటే సింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఛోటే సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులను సత్కరించేందుకు ప్రిన్సిపల్ పూల మాలలు తీసుకొచ్చారు. అయితే, ఆ పూలను పాలిథిన్ కవర్లలో తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ కు రూ. 1000 జరిమానా విధించారు. జరిగిన ఘటనతో ప్రిన్సిపల్ షాక్ కు గురయ్యారు. అక్కడున్న వారంతా మౌనంగా ఉండిపోయారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, పూలమాలలను సింగిల్ యూజ్ కవర్లలో తీసుకొచ్చారని, తాగు నీటిని కూడా సింగిల్ యూజ్ వాటర్ బాటిల్స్ ద్వారానే అందించారని చెప్పారు. వందలాది మంది విద్యార్థులు ఉన్న చోట ఇలాంటి పనులు చేయడం సరికాదని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడానికే తాను అలా చేశానని చెప్పారు. ఇలాంటి వస్తువులను ప్రభుత్వ కార్యక్రమాల్లో వాడితే... సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.
దీనిపై ప్రిన్సిపాల్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహించిందని, అన్ని ఏర్పాట్లు వారే చేశారని చెప్పారు. పాలిథిన్ బ్యాగుల్లో పూలమాలలు తీసుకురావడం వల్ల జిల్లా కలెక్టర్ జరిమానా విధించారని తెలిపారు. తమ పాఠశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తమ పాఠశాలలో నిర్వహించినందువల్ల, అన్నీ సరిగ్గా ఉన్నాయో? లేదో? చూసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని కలెక్టర్ చెప్పారని అన్నారు.