Ramcharan: సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం రాజమౌళికి తగదు: అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు వీరభద్రరావు
- 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్న రాజమౌళి
- హీరోలుగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్
- నర్సీపట్నం ఆర్డీవోకు వినపత్రం ఇచ్చిన వీరభద్రరావు
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అగ్రదర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం తగదని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజుకు, కొమురం భీంకు ఎలా స్నేహం ఏర్పడిందో చరిత్రలో ఎక్కడా లేదని, చరిత్ర చెప్పని విషయాలను రాజమౌళి ఎలా వక్రీకరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
సినిమాలో చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలని ఆ విజ్ఞాపన పత్రంలో కోరారు. అల్లూరి సీతారామరాజు 1897లో జన్మించి 1924న మరణించారని, కొమురం భీం 1901లో జన్మించి 1941లో చనిపోయారని చరిత్రలో పేర్కొన్నారని, వీరిద్దరికి ఎప్పుడు, ఎలా స్నేహం కుదిరిందన్న విషయం చరిత్రలో లేనేలేదని పడాల వీరభద్రరావు చెబుతున్నారు.