Andhra Pradesh: ఏపీలో అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ జీవో
- వైసీపీ మేనిఫెస్టోలోని మరో హామీ అమలు
- అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించే జీవో 439 విడుదల
- జీవో విడుదలపై అర్చక సమాఖ్య హర్షం
వైసీపీ మేనిఫెస్టోలోని మరో హామీని సీఎం జగన్ అమలు చేశారు. అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ జీవో 439 విడుదల చేశారు. ఈ జీవో విడుదలపై సీఎం జగన్ కు అర్చక సమాఖ్య ప్రతినిధులు తమ కృతఙ్ఞతలు తెలిపారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా స్పందించారు. హిందూ, దేవాదాయ, ధార్మికతను కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు సౌందరరాజన్, రంగరాజన్ అభినందనలు తెలిపారు.
2007లో అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు. గత పదేళ్లుగా ఈ చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేయలేదు. వైసీపీ మేనిఫెస్టోలో హామీ మేరకు అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ జీవో జారీ చేశారు.