Inter: ఇంటర్ బోర్డులు పెట్టి ఐఐటీ, జేఈఈ కోచింగ్ ఎలా ఇస్తారు?: మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యలు
- 2 వేలకు పైగా కాలేజీలు నిబంధనలు పాటించడం లేదన్న మంత్రి
- పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడి
- నేమ్ బోర్డులపై కాలేజీ పేరు, కోడ్ నెంబరు మాత్రమే ఉండాలని స్పష్టీకరణ
రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరుతెన్నులు, కళాశాలలపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డులు పెట్టి ఐఐటీ, జేఈఈ కోచింగ్ ఎలా ఇస్తారంటూ కాలేజీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2 వేలకు పైగా ప్రైవేటు కాలేజీలు నిబంధనలు ఉల్లంఘించాయని అన్నారు. ఇంటర్ విద్యా విధానంలో 80 శాతం ప్రైవేటు కాలేజీలే ఉన్నాయని, ఐఐటీ, ఐఐఎం కోచింగ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు.
అంతేకాకుండా, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు, ఇతర పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సి ఉందని, అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ కాలేజీలపై బోర్డులపై కాలేజీ పేరు, కోడ్ నెంబరు మాత్రమే ఉండాలని మంత్రి ఆదిమూలపు స్పష్టం చేశారు. ఇకమీదట ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఏకీకృత నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తాము సూచించిన విధంగా నేమ్ బోర్డులను 10 రోజుల్లోగా ఏర్పాటు చేయకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.