Nikhat Zarin: నిఖత్ జరీన్ కు న్యాయం చేయండి.... కేంద్ర మంత్రికి లేఖ రాసిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- టోక్యో ఒలింపిక్స్ లో నిఖత్ కు దక్కని అవకాశం
- ట్రయల్స్ లేకుండా మేరీకోమ్ ను పంపాలని బాక్సింగ్ సమాఖ్య నిర్ణయం
- మేరీ కోమ్ తో తనకు పోటీ ఏర్పాటు చేయాలన్న నిఖత్ జరీన్
వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ కు వెళ్లే భారత బృందంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కు కూడా అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ యువ ప్రతిభావంతురాలని, 51 కేజీల విభాగంలో అనేక ఘనవిజయాలు సాధించిందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అయితే టోక్యోలో 2020లో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఆమెకు సెలక్షన్ ట్రయల్స్ లో సత్తా చాటుకునే అవకాశం కల్పించలేదని, దయచేసి కేంద్ర క్రీడల మంత్రి జోక్యం చేసుకుని నిజమైన క్రీడాస్ఫూర్తి కలిగిన క్రీడాకారులకు న్యాయం చేయాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
కాగా, ఎప్పుడూ 48 కిలోల కేటగిరీలో పాల్గొనే సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ ఇటీవలే 51 కిలోల విభాగానికి మారింది. దాంతో 51 కిలోల విభాగంలో పోటీపడే నిఖత్ కు అన్యాయం జరిగే పరిస్థితులు తలెత్తాయి. మేరీ కోమ్ సీనియారిటీ దృష్ట్యా ఆమెను ఎలాంటి సెలక్షన్ ట్రయల్స్ లేకుండానే ఇటీవల వరల్డ్ చాంపియన్ షిప్ కు పంపారు. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ కు కూడా సెలక్షన్ ట్రయల్స్ లేకుండానే మేరీని పంపేందుకు నిబంధనలు మార్చేందుకు భారత బాక్సింగ్ సమాఖ్య సిద్ధపడింది.
దాంతో, ఈ విషయంపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు నిఖత్ జరీన్ లేఖ రాసింది. మేరీ కోమ్ తో తనకు పోటీ నిర్వహించాలని, విజేతను టోక్యో ఒలింపిక్స్ కు పంపాలని కోరింది. దీనిపై మేరీ కోమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ నిఖత్ జరీన్ ఎవరు? అంటూ అవమానకరంగా మాట్లాడడంతో తెలుగు క్రీడావర్గాలు మండిపడ్డాయి.