Bharath ki Lakshmi: అత్యున్నత శిఖరాలకు చేరిన మహిళలను గౌరవిద్దాం: ప్రధాని మోదీ
- మహిళా సాధికారత చాటేందుకు ‘భారత్ కీ లక్ష్మీ’
- ప్రచారకర్తలుగా నటి దీపికా పదుకునే, షట్లర్ పీవీ సింధు
- ఇలాంటి మహిళలను గుర్తించి వెలుగులోకి తేవాలి
విభిన్న రంగాల్లో అత్యున్నత శిఖరాలకు చేరిన మహిళలను గుర్తించి గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే మహిళా సాధికారత, మహిళల కృషిని చాటేందుకు ‘భారత్ కీ లక్ష్మీ’ అన్న కార్యక్రమానికి రూపకల్పన చేశామని చెప్పారు.
‘దీపావళి సందర్భంగా ‘భారత్ కీ లక్ష్మీ’ చేపడుతున్నాం. విభిన్న రంగాల్లో ఉన్నతంగా రాణించిన అమ్మాయిలను గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది’ అని మోదీ వీడియోలో పేర్కొన్నారు. దీపావళి రోజు ప్రతీ ఇంటా లక్ష్మీదేవత కొలువుదీరి సుఖసంతోషాలను అందిస్తుందని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం ప్రచారకర్తలుగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే, స్టార్ షట్లర్ పీవీ సింధులను నియమించినట్లు తెలిపారు.
ఇందుకోసం వీరిద్దరితో ఒక వీడియోను రూపొందించారు. అనాథలను అక్కున చేర్చుకుని అమ్మలా వారి ఆలన పాలన చూస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సింధుతై సప్కాల్ వంటి సేవా తత్పరత ఉన్న మహిళల పేర్లను ప్రస్తావిస్తూ వీరి వీడియో కొనసాగుతుంది. ఇలాంటి లక్ష్మీలు ఉన్న ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని దీపిక, సింధులు వీడియోలో చెబుతున్నారు.