Andhra Pradesh: నేరాల్లో టాప్-10లో ఏపీ.. తల్లిదండ్రులపై పైశాచికాల్లో నాలుగో స్థానం!
- బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో నేరాలు అధికం
- సైబర్ నేరాల్లో కర్ణాటక టాప్
- అత్యాచారాలు, ఆర్థిక మోసాల్లో ఏపీకి ఏడో స్థానం
దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న నేరాల్లో ఏపీ టాప్-10లో నిలిచింది. ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ)-2017 నివేదిక వెల్లడించింది. వృద్ధ తల్లిదండ్రులపై జరుగుతున్న నేరాల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలవగా, సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, ఆర్థిక మోసాలు వంటి వాటిలో ఏడో స్థానంలో ఉంది. ఏపీ కంటే ముందు బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి.
వృద్ధులపైనా, దళితులపైనా ఏపీలో దాడులు బాగా పెరిగినట్టు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ఇక, మానవ అక్రమ రవాణాలో ఏపీ ఏడో స్థానంలో నిలిచింది. ఉపాధి పేరుతో మహిళల్ని కొన్ని ముఠాలు దేశం దాటిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. సైబర్ నేరాల విషయంలో కర్ణాటక అగ్రస్థానంలో నిలవగా ఏపీ ఏడో స్థానంలో ఉంది. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గిరిజనులపై దాడుల విషయంలో 9వ స్థానంలో ఉంది. ఇక, రాష్ట్రంలో 2017లో జరిగిన హత్యల్లో 179 వివాహేతర సంబంధాల కారణంగానే జరిగినట్టు నివేదిక పేర్కొంది.