galla jayadev: చంద్రబాబు మళ్లీ గెలిచి ఉంటే బాగుండేదని కేంద్రంలో అనుకుంటున్నారు: గల్లా జయదేవ్
- రాజధాని మొత్తం ఒక చోటే ఏర్పాటు కావాలి
- టీడీపీ హయాంలో రాష్ట్రానికి 600 అవార్డులు
- ఏపీకి భవిష్యత్ ఉండాలంటే రాజధాని ఏర్పాటు కావాల్సిందే
ఏపీ ప్రజలు పొరపాటు చేశారని, మొన్నటిసారి కూడా మళ్లీ చంద్రబాబును గెలిపించి ఉంటే బాగుండేదని కేంద్రమంత్రులు అభిప్రాయపడినట్టు టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తాను వారిని కలిసినప్పుడు వారిదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని మొత్తం ఒకే ప్రాంతంలో ఏర్పాటైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయని అన్నారు.
టీడీపీ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి 600 అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. రాజధానిలో అనుసంధాన రహదారులకే రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం వెనకబడిపోతోందని, భవిష్యత్ ఉండాలంటే రాజధాని ఉండాల్సిందేనని జయదేవ్ స్పష్టం చేశారు. తమ హయాంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేశామని, విశాఖపట్టణం, కాకినాడ, అనంతపురం వంటి ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఖర్చు చేసినట్టు జయదేవ్ గుర్తు చేశారు.